తమిళనాడులో ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. కోటి కుటుంబాలకు సున్నా బిల్లు!

  • తమిళనాడులో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలుకు రంగం సిద్ధం
  • వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచే ఈ పథకాన్ని వర్తింపజేయనున్న ప్రభుత్వం
  • కొత్త స్కీమ్‌తో సుమారు 1.2 కోట్ల కుటుంబాలకు సున్నా బిల్లు
  • 500 యూనిట్ల లోపు వాడే వారందరికీ 200 యూనిట్లు ఉచితం
తమిళనాడులో గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకాన్ని విస్తరిస్తూ తీసుకున్న నిర్ణయం వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచి అమల్లోకి రానుంది. ఈ కొత్త విధానంతో రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాలకు విద్యుత్ బిల్లు సున్నాకు చేరనుంది. ముఖ్యమంత్రిగా సి.జోసెఫ్ విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న ఈ తొలి కీలక నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు.

ఈ పథకం అమలు కోసం తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TNPDCL) తమ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తోంది. ప్రభుత్వ నూతన విధానానికి అనుగుణంగా అర్హుల గుర్తింపు, సబ్సిడీ లెక్కింపు, బిల్లుల జారీ వంటి మార్పులను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచినట్లు టీఎన్‌పీడీసీఎల్ అకౌంట్స్ విభాగం వెల్లడించింది. క్షేత్రస్థాయి సిబ్బందికి దీనిపై పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన వినియోగదారులకు ఎలాంటి జాప్యం లేకుండా లబ్ధి చేకూరేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం రెండు నెలలకు 500 యూనిట్ల లోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 2.46 కోట్ల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 100 యూనిట్ల లోపు వాడే 67 లక్షల కుటుంబాలు సున్నా బిల్లు పొందుతున్నాయి. తాజా విస్తరణతో ఈ సంఖ్య ఏకంగా 1.2 కోట్లకు పెరగనుంది. మరో 85.83 లక్షల మంది వినియోగదారుల బిల్లులు ప్రతి రెండు నెలలకు సుమారు రూ. 235 వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే, 500 యూనిట్లకు మించి వాడే 34.24 లక్షల మందికి మాత్రం పాత పద్ధతిలోనే 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రయోజనం కొనసాగుతుంది.

ఈ పథకం ద్వారా అయ్యే అదనపు ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. మే 10న ప్రభుత్వం ఈ ప్రకటన చేసిన వెంటనే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ ప్రక్రియను ప్రారంభించారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

C Joseph Vijay
Tamil Nadu
free electricity
electricity bill
TNPDCL
power distribution
electricity subsidy
free power scheme
Tamil Nadu government
power consumption

More Telugu News